‘‘3జి చూశాం.. 4జి చూశాం.. ఇప్పుడు డీజీ (ధోని-జి) చూస్తున్నాం నిన్న రాత్రి ధోని
చేసిన స్టంపింగ్ అందులో భాగమే’’‘‘బ్యాట్‌తోనే కాదు.. బంతితో సైతం చివరి బంతికి
భారత్‌ను ఎలా గెలిపించాలో ధోనీకి తెలుసు’’... బుధవారం రాత్రి నుంచి సామాజిక
మాధ్యమాల్లో ధోని మీద వెల్లువెత్తుతున్న సందేశాల పరంపరలో ఇవి కొన్ని మాత్రమే!
ఈనాడు క్రీడావిభాగం
ధోని భారత విజయాల్లో కీలక పాత్ర పోషించడం.. అతడిపై
ప్రశంసలు వెల్లువెత్తడం కొత్తేమీ కాదు. ఐతే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ధోని పోషించిన
పాత్ర మాత్రం అసాధారణం! అందుకే ఇప్పుడు దేశమంతా అతడిని కీర్తిస్తోంది. కెప్టెన్‌గా, వికెట్‌కీపర్‌గా బంగ్లాతో పోరులో ధోని పోషించిన
పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే! అందుకే ‘‘భారత్‌లో ఇప్పటికీ ధోనీని
ద్వేషిస్తున్నవాళ్లెవరైనా ఉంటే.. వాళ్లసలు భారతీయులే కాదు’’ అంటూ ఓ అభిమాని
భావోద్వేగానికి గురయ్యాడు ట్విటర్లో. ధోనికి కెరీర్లో ఎత్తుపల్లాలు కొత్తేమీ కాదు.
కొన్ని ఓటములు ఎదురవగానే అతడిపై తీవ్ర విమర్శలు గుప్పించడం.. ఇక అతడి పనైపోయిందని
తేల్చేయడం.. అతణ్ని సాగనంపాలని డిమాండ్లు చేయడం.. ఇప్పటికి చాలాసార్లు జరిగింది.
నిరుడు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల
చేతుల్లో ఓటముల తర్వాత కూడా ధోనికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కోహ్లి టెస్టు
సారథిగా నిరూపించుకున్న నేపథ్యంలో అతణ్నే పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ కెప్టెన్‌ను
చేయాలని.. ధోనీని సాగనంపేయాలని డిమాండ్లు వినిపించాయి. టీ20 ప్రపంచకప్‌కు ధోని కెప్టెన్‌గా ఎందుకని
ప్రశ్నించిన గళాలూ ఉన్నాయి. ఐతే బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా ధోని అంటే ఏంటో.. భారత
క్రికెట్‌కు అతనెంత ముఖ్యమో మరోసారి రుజువైంది. ధోని నాయకత్వ పటిమ.. అతడి
వ్యూహాలు.. అతడి బౌలింగ్ మార్పులు.. అతడి వేగం.. అతడి సమయోచిత స్పందన (ప్రెజెన్స్
ఆఫ్ మైండ్).. అతడి ప్రశాంతచిత్తం.. చూసి క్రికెట్ ప్రపంచం మొత్తం అబ్బురపడింది.
ఇక భారత అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు!

